T20 World Cup: టీ20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఇవాళ్టి నుంచి సెమీఫైనల్ పోరు స్టార్ట్ కానుంది. సెమీస్ కి ముందు భారత జట్టు ఫీల్డింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది మానసిక సమస్యా? లేక కేవలం ఏకాగ్రత లోపమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన పలు మ్యాచ్ లలో ఇండియన్ టీమ్ సంపూర్ణ ప్రదర్శన చేయలేకపోయింది.. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రెండు కీలక క్యాచ్‌లను వదిలేశాడు. అలాగే తిలక్ వర్మ కూడా ఒక సులభమైన క్యాచ్ ని వదిలి పెట్టాడు అని పేర్కొన్నాడు.
ఎవ్వరూ కూడా కావాలని క్యాచులని వదలరు.. ఫీల్డింగ్‌పై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం అని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. ప్రపంచకప్‌కు ముందు నుంచే ఇది మా ముఖ్య అంశాల్లో ఒకటిగా ఉంది. ప్లేయర్స్ కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు.. కానీ ఇది మానసిక సమస్యా కాదా అన్నదానికి నేను సమాధానం చెప్పలేనని అన్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత్ ఇప్పటి వరకు 13 క్యాచ్‌లు వదిలేసింది.. ఈ మెగా ఈవెంట్ లో ఏ జట్టు కూడా ఇన్ని క్యాచులని వదిలి పెట్టలేదని వెల్లడించాడు. ఫీల్డింగ్ మెరుగుపడాలంటే ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కీలక ప్రాంతాల్లో సరైన ఆటగాళ్లను నియమించడం ముఖ్యం.. మైదానంలో వేగంగా స్పందించే ప్లేయర్స్ ఉండాలని సూచించాడు.
సరైన ఆటగాళ్లను కీలక స్థానాల్లో ఉంచగలిగితే క్యాచ్‌లను ఈజీగా అందుకునే అవకాశం ఉంటుందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ పేర్కొన్నారు. మైదానంలో ప్రతి ఒక్క ఆటగాడు బాధ్యత తీసుకుని కాస్త శ్రమిస్తే ఫలితాలు మారుతాయని చెప్పాడు. రేపు (మార్చి 5న) ముంబైలోని వాంఖెడే వేదికగా భారత్ వర్సెస్ -ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. కీలక పోరుకు ముందు ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దడం టీమిండియాకు అత్యవసరం. మరోవైపు ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. టామ్ బాంటన్ ఇప్పటికే 10 క్యాచ్‌లు పట్టగా, గ్లెన్ ఫిలిప్స్ అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా టోర్నీలో టాప్ లో కొనసాగుతున్నాడు.
